భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. మార్చి 21న ఏం జరగబోతోంది..?

14932

గంటకు 77 వేల మైళ్ల వేగం అంటే ఆ ఊహే భయంకరంగా ఉంది. ఓ భారీ గ్రహశకలం ఇప్పుడు అదే వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుంది. ఇది కంటిమీద కునుకు లేకుండా చేసే విషయమే. అంత వేగంతో భూమి వైపునకు దూసుకొస్తున్న గ్రహశకలం భూమిని ఎక్కడ ఢీకొడుతుందా అనే టెన్షన్ వెంటనే మొదలవుతోంది. 2020లో ఈ ప్రపంచం అంతం అయిపోతుందని చాలా మంది అనుకున్నారు. కొందరు అంతరిక్ష మేధావులు.. పండితులు కలిసి చేసిన ఆ ప్రచారానికి సోషల్ మీడియా తోడై యుగాంతం అంటూ హోరెత్తించారు. కానీ అలా జరగలేదు. వాళ్ళు చెప్పిన సమయం ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి గుర్తులేదు. సహజంగానే క్యాలెండర్ లో సంవత్సరం మారిన ప్రతిసారి ఈ సంవత్సరం విపత్తులు ఏవైనా ఉన్నాయా అని యుగాంత కారులు వెతుకుతుంటారు. అంతరిక్ష పరిశోధనా సంస్థలు చెప్పే కొన్ని విషయాలను వీరు వండి వార్చి ప్రజలలో అటెన్షన్ క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వారికి నాసా చెప్పిన ఓ వార్త కలవరం కలిగిస్తోంది. ఏంటంటే.. ఇప్పుడు ఓ భారీ గ్రహశకలం భూమివైపు వస్తోంది.

అంతరిక్షం అంటేనే అనేక ఉల్కలు, గ్రహాలు, ఉప గ్రహాలు, గ్రహ శకలాల కలయిక. అవన్నీ వాటి గమనం.. కదలికల మీదనే భూమి మీద మన జీవనం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు. పరిశోధనా సంస్థలు వీటిపై కూడా ఎన్నో పరిశోధనలు చేస్తుంటారు. వీటి వలన మనిషి నివసించే భూమికి ఏదైనా ప్రమాదం ఉందా? ఉంటే దేనివలన ఈ ప్రమాదం ఉంటుంది? ఎన్ని సంవత్సరాలకు అవి భూమికి దగ్గరగా వస్తాయి అన్న విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటారు. ఇదే కోవలో తాజాగా కూడా ఓ గ్రహ శకలం గురించి నాసా శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించారు. త్వరలో ఓ గ్రహశకలం భూమికి చేరువగా రానున్నట్లు వారు గుర్తించారు. భూమికి 1.25 మిలియన్ల మైళ్లు అంటే దాదాపు 20 లక్షల కిలోమీటర్లు దూరానికి చేరుకుంటుందని ప్రకటించారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని చాలా అరుదుగా చూసే అవకాశముందని అమెరికా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఇది భూమిని తాకే అవకాశం లేదని మాత్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమికి అతిచేరువలో రానున్న ఈ ఆస్ట్రాయిడ్ పేరు 2001 FO32. ఇది 3000 అడుగుల వ్యాసం ఉన్నట్లు అంచనా వేస్తుండగా.. తొలుత దీన్ని 20 ఏళ్ల క్రితం కనుగొన్నట్లు నాసా వెల్లడించింది. 2001 FO32 కక్ష్యా మార్గం సూర్యుడు చుట్టూ ఉన్న విషయం తమకు తెలుసని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడాస్ అన్నారు. కానీ.. ఈ గ్రహశకలం భూమి వద్దకు 20 లక్షల కిలోమీటర్ల దురానికి మించి రాదని ఆయన చెప్పారు. ఈ దూరం చంద్రుడు-భూమికి మధ్య ఉన్న దూరం కంటే 5.25 రెట్లు ఎక్కువ. కనుక భూమికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన వెల్లడించారు. ఆ ఆస్ట్రాయిడ్ దూసుకొస్తున్న వేగాన్నిబట్టి చూస్తే.. మొత్తం మన భూమండలాన్ని ఒక అర్ధగంటలో చుట్టి వచ్చేస్తుందన్నమాట. అయితే, అంతరిక్ష భాషలో చూస్తే ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుంది. ఇది ప్రమాదకరమే అయినప్పట్టికీ.. ఈసారి భూమిని ఢీకొట్టడం.. లేదా భూమికి అతి చేరువకి వచ్చే అవకాశం లేనేలేదు. దీనితో ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని నాసా చెబుతోంది. అయినప్పటికీ ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో దీన్ని కూడా వర్గీకరించాల్సి ఉందని పాల్ అన్నారు. దీంతో భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలమని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

అయితే ఇంతకీ ఈ శకలం భూమికి చేరువకి వచ్చేది ఎప్పుడంటే ఈనెలలోనే. ఈ మార్చి నెల 21న 2001 FO32 గ్రహ శకలం భూమికి చేరువకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 77 వేల మైళ్ల వేగంతో దూసుకొస్తున్న ఈ ఆస్ట్రాయిడ్ గురించి శాస్త్రవేత్తలకు కూడా పెద్దగా తెలియదని, దీని గురించి మరింత క్షుణ్నంగా తెలుసుకోవడాననికి ఇది అద్భుతమైన అవకాశమని నాసా జెట్ ప్రోపల్షన్ లేబరేటరీ ప్రధాన శాస్త్రవేత్త లాన్స్ బెన్నర్ అన్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం పరిమాణాన్ని అర్థం చేసుకోవాలని, ఉపరితలం నుంచి ప్రతిబింబించే కాంతి అధ్యయనం చేయడం ద్వారా దీని గురించి తెలుసుకోవాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యరశ్మి ఈ ఆస్ట్రాయిడ్ ఉపరితలాన్ని తాకినప్పుడు శిలలోని ఖనిజాలు.. కొన్ని తరంగదైర్ఘ్యాలను గ్రహిస్తాయి. మరికొన్నింటిని ప్రతిబింబిస్తాయని నాసా చెప్పింది. ఉపరితలం నుంచి ప్రతిబింబించే కాంతి వర్ణపటాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహశకలం ఉపరితలంపై కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ని కొలుస్తారు. ఈ ఆస్ట్రాయిడ్ దక్షిణ భాగంలో ప్రకాశవంతంగా వెలుగుతుందని పాల్ చోడాస్ తెలిపారు. మరి ఈ శకలం భూమికి చేరువలో ప్రయాణించిన అనంతరం ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో చూడాల్సి ఉంది.

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం మార్చి 21న ఏం జరగబోతోంది..?