ఎంపీటీసీపై హత్యాయత్నం.. సినీ ఫక్కీలో అర్ధరాత్రి దాడి!

166

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మరీ వైలెంట్ గా మారిపోతున్నాయి. గతంలో ఎక్కడో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలోనే అప్పుడప్పుడు బయటపడే ఫ్యాక్షనిజం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మెల్లగా వ్యాపిస్తుందా అనిపిస్తుంది. ఏపీలో సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలంగాణలో మొన్న న్యాయవాది వామనరావు దంపతుల హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ ఎంపీటీసీపై సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి వేళ బైక్​పై వెళ్తున్న బాధితుడిని కొందరు కారులో వెంబడించి దాడి చేశారు.

హంతకుల నుండి తప్పించుకునేందుకు ఎంపీటీసీ మరో మార్గంలో వెళ్లేందుకు యత్నించాడు. ఈ ఎత్తును ముందే ఊహించిన దుండగులు.. అక్కడ మరో ముఠాను సిద్ధంగా ఉంచారు. అదృష్టం కొద్ది అక్కడి నుంచీ ఎంపీటీసీ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దాడి సంచలనంగా మారింది. ఇల్లందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాముపై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి జేకే కాలనీ నుంచి మోటార్ బైక్​పై ఇంటికి వెళ్తున్న రామును కారులో కొందరు దుండగులు వెంబడించారు. గమనించిన రాము మరో మార్గంలో వెళ్తుండగా.. అక్కడే మాటు వేసిన మరికొందరు అతడిపై దాడికి యత్నించారు.

మరో మార్గంలో దాడిని కూడా ముందే ఊహించిన రాము అప్రమత్తమై చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకోవటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఎంపీటీసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కొందరి వల్ల తనకు ప్రాణభయం ఉందని, తనను అంతమొందించాలని చూస్తున్న వారిని అరెస్టు చేయాలని రాము పోలీసులను కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడి కోసం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఎంపీటీసీపై హత్యాయత్నం.. సినీ ఫక్కీలో అర్ధరాత్రి దాడి!