ఏపీలో అరెస్టులు.. దాడులు.. ఏ పార్టీకి ఉపయోగం?

261

ఏపీలో రాజకీయ పరిస్థితులు వాడీవేడీగా ఉన్నాయి. ఆ మాటకొస్తే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అదే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రజావేదిక కూల్చివేత నుండి ఎన్నో ఎన్నెన్నో నిర్ణయాలు వివాదాస్పదమే కాగా.. ప్రభుత్వ తీరు కూడా ఒక వివాదం ముగిసేసరికి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చేలా కనిపిస్తూనే ఉంది. రాజధాని మార్పు.. కూల్చివేతలు, రీటెండర్లు, నిలిపివేతలు ఇవన్నీ ఒకెత్తు అయితే కక్ష్య సాధింపు, సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు, బెదిరింపులు వంటివి ఎప్పటికప్పుడు అత్యంత వివాదంగా మారుతూనే ఉన్నాయి.

కేసులు ఏవైనా.. వ్యవహారం ఏదైనా ప్రధాన నేతల అరెస్టులు, దాడులు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారిపోయాయి. గతాన్ని కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, మరో టీడీపీ నేత పట్టాభిపై దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. అచ్చెన్నాయుడిపై బెదిరింపుల కేసు బుక్ చేసిన పోలీసులు రిమాండ్ కోరడం.. కోర్టు అందుకు ఒకే చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. అచ్చెన్నాయుడు మాట్లాడిన కాల్ రికార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా అందులో బెదిరింపుల దాఖలాలు కనిపించడం లేదు.

ఇక పట్టాభిపై దాడి పూర్తిగా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా అది అధికార పార్టీ నేతలు, కార్యకర్తల పనేనని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రజలలోకి తీసుకెళ్లారు. టీడీపీ నేతల విషయంలో ఏమంత చిన్న లూప్ దొరికినా తీవ్రంగా స్పందించడం ప్రభుత్వం తీరుగా కనిపిస్తుంది. అయితే.. ఇలాంటి తీరు సాధారణ పరిస్థితిలో అధికార పార్టీకి కలిసి వస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమయం. ఇలాంటి సమయంలో అధికార పార్టీ దృష్టి గెలుపు మీద ఉండాలి. ప్రజలను మచ్చిక చేసుకొని సామరస్య వాతావరణం కల్పించాలి.

నిజానికి జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రూరల్ లో మంచి ఫలితాలే ఇస్తున్నాయి. అధికార పార్టీ వాటిని ఓట్లుగా మలచుకోవాలి. వివాదాలకు దూరంగా ప్రజలకు దగ్గర మెలిగి ఇది ప్రజల ప్రభుత్వంగా మసలుకోవాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్.. అధిష్టానం పెద్దలకు ఆ ఉద్దేశ్యం లేకపోయినా క్షేత్రస్థాయిలో కక్షసాధింపు అనే టాక్ బలంగా వెళ్తుంది. ఇది సంక్షేమ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రస్తుతం అధికార పార్టీకి అది గెలుపుగా కనిపించినా ప్రజలలో ఫలితాలు మారిపోతాయి. ప్రశాంత వాతావరణంలో.. వివాదాలకు దూరంగా.. సంక్షేమ, అభివృద్ధి నినాదంతో ప్రభుత్వం మసలుకుంటే ఫలాలు అనుభవించిన ప్రజలు సైతం ప్రభుత్వానికి అనుబంధంగా మారిపోతారన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి ప్రభుత్వం తీరు మారేనా?

ఏపీలో అరెస్టులు.. దాడులు.. ఏ పార్టీకి ఉపయోగం?