ఢిల్లీ ట్రాక్టర్‌ ర్యాలీ హింసపై విచారణ డిమాండ్ కు ‘సుప్రీం’ నో

155

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన హింసపై విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం.. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు కమిషన్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ పిటిషన ను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామ సుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.. ఈ కేసులో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ (సిజెఐ) ఎస్‌ఐ బొబ్డే అన్నారు. దర్యాప్తులో లోపం లేదని.. ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని అన్నారు.. ఈ విషయంలో ప్రధాని ప్రకటన కూడా విన్నామని.. చట్టం తన పని తాను చేసుకుపోతోంది కాబట్టి ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయనివ్వండని అన్నారు.