Ap MPTC ZPTC Elections: ఎస్ఈసీ ప్రకటనకు ఊహించని రెస్పాన్స్!

682

Ap MPTC ZPTC Elections: ఏపీలో ఎన్నిక ఏదైనా వివాదం కామన్ అన్నట్లుగా మారిపోయింది. ఎన్నికల కమిషనర్ ముందు నిర్వహించాలని తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సంస్థలు ఏకగ్రీవాలు కాగా నామినేషన్లలో బెదిరింపులు, ప్రలోభాలు పెద్దఎత్తున దుమారంగా మారింది. సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెల్స్ కూడా అభ్యర్థుల బెదిరింపులపై కథనాలు ప్రసారం చేయగా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి కొట్టిపారేసింది. అప్పుడు ఆ ప్రక్రియ అక్కడ ఆగితే పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్.. ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య పంతాలు, పట్టింపుల వ్యవహారం.. చివరికి ఎన్నికల ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే ప్రభుత్వమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని కోరడం.. ఎస్ఈసీ సైతం ఆ దిశగా అడుగులు వేయడంతో ఇప్పుడు ఎన్నికల వేడి కొనసాగడం ఖాయమైపోయింది. అయితే.. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో వివాదాలను దృష్టిలో పెట్టుకొని ఎస్ఈసి రమేష్ కుమార్ ఓ కీలక ప్రకటన చేశారు. నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వస్తే ఒత్తిళ్లు, బెదిరింపులతో నామినేషన్లు వేయలేని వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు.

ప్రత్యర్థుల బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేని వారు, వేసినా వెనక్కి తీసుకున్న వారు తగిన ఆధారాలతో వస్తే మరో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనకు పదుల సంఖ్యలో బాధితులు స్పందించారు. నామినేషన్లను వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వస్తే.. అడ్డుకున్నారని. బెదిరించారని.. పత్రాలు లాక్కున్నారని.. దీటుగా నిలబడి నామినేషన్లు వేస్తే.. ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు తెచ్చారని.. నిర్బంధించి.. దాడులకూ తెగబడ్డారని అంటూ పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, ఔత్సాహికులు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు.

తాము నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వస్తే కొందరు అడ్డుకుని బెదిరింపులకు గురిచేసినట్లు పలువురు స్థానిక సంస్థల అభ్యర్థులు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరి ఎస్ఈసీ ఈ అభ్యర్థులకు చెప్పినట్లుగానే మరో అవకాశం ఇస్తారా? ఇస్తే దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎస్ఈసీపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి జెడ్పీటీసి, ఎంపీటీసీలలో ఏకగ్రీవాలైన స్థానాలకు ఇప్పుడు మరో అవకాశం అంటే ఇది ఖచ్చితంగా మరో వివాదం తప్పదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Ap MPTC ZPTC Elections: ఎస్ఈసీ ప్రకటనకు ఊహించని రెస్పాన్స్!