ముగిసిన పంచాయతీ రచ్చ.. ఇక తెర మీదకి మళ్ళీ మూడు రాజధానులు

174

నిన్నటి వరకు ఏపీలో పంచాయతీ సమరం నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన సంగతి తెలిసిందే. మొత్తంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ సమరానికి స్పష్టమైన తీర్పుతో చెక్ పెట్టేయడంతో రాష్ట్రంలో ఎన్నికలకు హడావుడి మొదలైంది. అయితే.. సోమవారం ఆ విషయం అలా సద్దుమణిగిందో లేదో మంగళవారం మరో అంశం తెరమీదకి వచ్చింది. ఇది కొత్త అంశం కాకపోయినా గణతంత్ర వేడుకల పుణ్యమా అని మూడు రాజధానుల అంశం మరోమారు తెరమీదకి వచ్చింది.

మంత్రులు.. ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న నేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చారు. అంతేకాదు.. రాష్ట్ర గవర్నర్ చేత కూడా తప్పదు మూడు రాజధానులు అవసరమే అనే మాటను పలికించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వ‌హించిన‌ 72వ గణతంత్ర వేడుకల సంద‌ర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్ర‌సంగించారు.

ఈ ప్రసంగంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రాజధానులు అవసరమేనని.. గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా పరిపాలన, న్యాయ, శాసన రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో మ‌త ప‌ర‌మైన వివాదాల‌ను సృష్టించ‌డానికి కొంద‌రు కుట్ర‌లు ప‌న్నార‌ని.. త‌మ ప్ర‌భుత్వం ఆ కుట్ర‌ల‌ను స‌మ‌ర్థంగా అడ్డుకోగ‌లిగింద‌ని తెలిపారు. ఆరోగ్య శ్రీ, పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన మహోన్నత పథకాలుగా చెప్పిన గవర్నర్ తమ ప్రభుత్వం మాటగా పలు విషయాలను వెల్లడించారు.

సహజంగా ఇలాంటి రోజున గవర్నర్లు ప్రభుత్వం విధానాలనే ప్రకటిస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఏ మాట చెప్పాలో గవర్నర్ ద్వారా చెప్పిస్తారు. హరిచందన్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే.. ఒక వివాదం ముగిసి ఒక రోజు కూడా గడవక ముందే చాలా కాలంగా వివాదాస్పద అంశంగా నలుగుతున్న మూడు రాజధానుల అంశాన్ని మరోసారి గుర్తు చేయడం ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తుంది. బహుశా.. ఏదో ఒక బర్నింగ్ అంశం ప్రజలలో చర్చకు లేకపోతే మంచిది కాదని ప్రభుత్వ పెద్దల అభిప్రాయమేమో!