Ap Employees Union: సమస్యల్లో ఉద్యోగులు.. సంఘాలేమో గప్ చుప్!

814

Ap Employees Union: ఎక్కడైనా ఉద్యోగ సంఘాలు ఏర్పడేది ఉద్యోగుల బాగోగుల కోసమే. ఉద్యోగులే సంఘంగా ఏర్పడి తమ పరిరక్షణ, హక్కుల రక్షణ కోసం కొందరు నేతలను నియమించుకుంటారు. తమ ఉద్యోగులు బాధల్లో ఉన్నా.. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా కొట్లాడి.. తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టిన ఉద్యోగ నేతలను మనం చూశాం. కానీ ఏపీలో ఉద్యోగ నేతలు మాత్రం తమ ఉద్యోగుల బాధలు తీర్చడం దేవుడెరుగు.. కనీసం వినేందుకు కూడా సమయం లేనంతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో మునిగిపోయారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

కొద్ది నెలలుగా ఏపీలో ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లే జీవనాధారం. వారు వృద్ధాప్యంలో పెన్షన్లతో చాలా అవసరాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పెన్షన్లు ఇప్పుడు రోజుల ఆలస్యం నుండి నెలల ఆలస్యంకు చేరింది. జనవరి నెలలో అందాల్సిన పెన్షన్లు ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇక రిటైరైన తర్వాత అందాల్సిన బెనిఫిట్స్ అందాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా అందడం లేదు. జీపీఎఫ్ కింద తాము పొదుపు చేసుకున్న సొమ్ములు రావడానికి ఆలస్యం అవుతున్నాయి. వీటితో పాటు ఉద్యోగులకు ఇంకా మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.

ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలది. చచ్చి చెడీ ఉద్యోగులు కొందరు ఉద్యోగ నేతలతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ షాడో సీఎంగా పేరుతెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అయితే.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నెలవారీ చెల్లింపుల ఆలస్యంపై సమావేశం ఏర్పాటైనా ఇక్కడ ఆ చర్చ అసలు రాకపోవడం విశేషం. ఈ సమావేశం మొత్తం ఉద్యోగ సంఘాల రాజకీయంతోటే సరిపోయింది.

ఒక శాఖకు ఒక ఉద్యోగ సంఘమే ఉండాలన్న ఓ ఉద్యోగ సంఘ నేత ప్రతిపాదన చేయడంతో సమావేశం మొత్తం రచ్చ రచ్చ చేసుకున్నారు. సమావేశ అజెండా అయిన ఉద్యోగుల కష్టాలను తీర్చమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మానేసి ఒక్క సంఘం మాత్రమే ఉండాలన్నట్లుగా ఒకరు మాట్లాడటం.. దానికి ఇతరులు చెలరేగిపోవడం… మొత్తంగా సమావేశం రసాభాస అవడం జరిగిపోయాయి. ఉద్యోగుల బాధలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు పెత్తనం మాకే దక్కాలని గొడవకు దిగారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డే ఉద్యోగ సంఘాల నేతలకు నచ్చజెప్పి సీఎంఎఫ్ఎస్‌ విధానం వల్ల జీతాల సమస్యలు వస్తున్నాయని.. త్వరలో వాటిని పరిష్కరిస్తామని చెప్పి పంపడం విశేషం!

Ap Employees Union: సమస్యల్లో ఉద్యోగులు.. సంఘాలేమో గప్ చుప్!