ఏపీలో భారీగా పెరిగిన ఉద్యోగుల జీతాలు

151

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యకళాశాలల్లో పనిచేస్తున్న బోధన వైద్యులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బోధన సిబ్బంది వేతనాలను పెంచుతున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక ఈ పెంపు 2021 మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 4 వేలమంది బోధన వైద్యులకు లబ్ది చేకూరనుంది. అకడమిక్‌ లెవెల్, సీనియార్టీని బట్టి వేతనాల పెంపు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వీరి జీతాలను 7వ వేతన సవరణ సంఘం‌ ప్రతిపాదనల ప్రకారం వేతనాలను పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జీతాల పెరుగుదలను ఓ సారి పరిశీలిస్తే 2006 పే స్కేల్ ప్రకారం ప్రొఫెసర్ కు రూ. 37,400-రూ.67 వేల వరకు వేతనాలు ఉండేవి. తాజా వేతన సవరణ ప్రకారం వీరి వేతనం రూ. 1,44,200-రూ.2,18,200 వరకు పెరగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బోధన వైద్యులు. వీరి జీతాల్లో సవరణ చివరి సరి 2006 లో జరిగింది.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా 2021లో జగన్ మోహన్ రెడ్డి వీరి కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచారు. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు బోధనా సిబ్బంది.

ఏపీలో భారీగా పెరిగిన ఉద్యోగుల జీతాలు