Vizag Steel Plant: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా బీజేపీ పరిస్థితి!

582

Vizag Steel Plant: దేశమంతా కాషాయ మాయం చేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. అందుకు సామ, ధాన, దండోపాయాలను అవలంభించడానికి మోడీ, షాల ద్వయం ఏ మాత్రం వెనకడుగు వేయరని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. పలు రాష్ట్రాలలో నానా రకాల ప్రణాళికలు వేసి కాషాయ జెండా ఎగరవేశారు. దక్షణాదిలో కూడా పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ పెద్దల ఆలోచన. ఇప్పటికే తెలంగాణలో పార్టీ బండి జోరు మీద ఉండగా తమిళనాడులో ప్రభుత్వాన్ని తన చేతిలో పెట్టుకుంది. ఇక మధ్యలో మిగిలింది ఆంధ్రప్రదేశ్. ఏదో ఒక మార్గాన ఇక్కడ పార్టీని స్టాంగ్ చేయాలని నేతలు చాలా కాలంగా తపన పడుతున్నారు.

పార్టీకి జవసత్వాలు నింపే ప్లాన్లో భాగంగా నేతల వలసలను ప్రోత్సహించిన ఏపీ బీజేపీ ఏ మాత్రం అవకాశం దొరికినా గోల్ చేసుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు మాత్రం ఏపీ బీజేపీని పది అడుగులు వెనక్కు లాగేస్తున్నాయి. ఇప్పటికే అమరావతి అంశంలో కేంద్ర, రాష్ట్ర బీజేపీ మధ్య అయోమయం నెలకొందని రాజకీయ వర్గాలలో వినిపించే మాట. కేంద్రం తలచుకుంటే రాజధాని అమరావతి నుండి అంగుళం కదలదని తెలిసినా కేంద్రం జోక్యం చేసుకోదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తాము అమరావతికి కట్టుబడి ఉన్నాం అని ప్రకటనలు ఇచ్చేశారు.

ఇక ఇప్పుడు విశాఖ ఉక్కు అంశం ఏపీ బీజేపీకి మరో సంకటంగా మారింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో సంస్థకి అమ్మేసేందుకు ఒప్పందం జరిగిపోయిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో కాక రేపుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ రాజీనామాల వరకు వెళ్లగా అధికార పార్టీ కూడా ఉద్యమానికి సిద్దమే అనే సంకేతాలు పంపుతుంది. ప్రజలు, వివిధ సంఘాలు ఇప్పటికే పోరు బాట పట్టాయి. గత్యంతరం లేని పక్షంలో ఏపీ బీజేపీ కూడా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు తాము వ్యతిరేకం అనే ప్రకటలు చేసింది. మరి కేంద్రంలో ఉన్నది తమ పార్టీనే కనుక ఒత్తిడి తెచ్చే బాధ్యత కూడా ఆ పార్టీపైనే పడింది.

దీంతో ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందు ప్రకటించింది ఆదివారమే ప్రయాణం కాగా ఒకరోజు ఆలస్యంగా సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మంత్రి అమిత్ షాను కలిసి ఏపీ నేతలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చించనున్నారు. కానీ ప్రైవేటీకరణను ఆపేలా ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఢిల్లీలో ఏపీ నేతల వద్ద ఉంటుందా అంటే దాదాపు అనుమానమే. ప్రైవేటీకరణ ఆపకపోయినా.. కనీసం ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేయకపోయినా రాష్ట్రంలో పార్టీ నష్టపోవడం ఖాయం. దీంతో ఏపీ బీజేపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి సామెతగా మారింది.

ఇప్పటికే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి తేల్చుకోస్తామని వెళ్లి ఉసూరుమనిపించారు. ఢిల్లీ పెద్దలను కలిసారో లేదో కానీ ఇప్పుడు పవన్ వైఖరి మారింది. విశాఖ ఉక్కు నిర్ణయం కేంద్రానిదేనని తేల్చేశారు. ప్రైవేటీకరణ ఇప్పటికే అడ్వాన్స్ స్టేజ్ లో ఉందన్నది నిపుణుల అంచనా. మరి ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీ నేతలు దాన్ని అడ్డుకొనే పరిస్థితి ఉండనే ఉండదు. ప్రయివేటీకరణ జరిగితే రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉండగా ఆ వేడికి ఏపీ బీజేపీకి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. మరి ఈ పరిస్థితిని ఏపీ బీజేపీ నేతలు ఎలా తట్టుకుంటారన్నది వేచిచూడాల్సి ఉంది.

Vizag Steel Plant: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా బీజేపీ పరిస్థితి!