Anchor Shyamala: షర్మిలతో భేటీ.. జగన్ తో కటీఫ్ అయినట్లేనా?

341

Anchor Shyamala: తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు, యాంకర్, పలు టీవీ కార్యక్రమాలను సైతం నిర్మిస్తున్న శ్యామల గత సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకున్న శ్యామల అప్పటి ఎన్నికలలో అడపాదడపా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చినా శ్యామల ఎక్కడా కనిపించలేదు. కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉన్న శ్యామల తాజాగా తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీతో మరోసారి వెలుగులోకి వచ్చారు. షర్మిల రాజకీయ అరంగేట్రం.. లోటస్ పాండ్ లో తొలిరోజు సమావేశం నిర్వహించిన మరుసటి రోజే శ్యామల లోటస్ పాండ్ లో ప్రత్యక్షమయ్యారు.

అప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా భర్త నరసింహారెడ్డితో కలిసి స్వయంగా షర్మిల ఇంటికి వెళ్లిన శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతం వైసీపీ నేతలెవరూ షర్మిలను కలిసే ఉద్దేశ్యంలో లేరు. పార్టీ హైకమాండ్ నుండి స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయని టాక్. అదలా ఉండగానే నేడు శ్యామల మరోసారి భర్తతో కలిసి షర్మిలతో భేటీ అవడం ఆసక్తిగా మారింది. గతంలో భేటీలో రాజకీయ కారణాలు లేవనుకున్నా నేడు భేటీ మాత్రం పక్కా రాజకీయంగానే కనిపిస్తుంది.

షర్మిల కొత్త పార్టీలో చేరేందుకు శ్యామల సన్నాహాలు చేసుకుంటున్న సంకేతాలు ఇచ్చేసినట్లేనని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా షర్మిలతో భేటీ అంటే ఒకవిధంగా జగన్ తో కటీఫ్ చెప్పుకున్నట్లేనని స్పష్టంగా అర్ధమవుతుంది. గత ఎన్నికలలో వైసీపీకి సినీ ప్రముఖులు చాలా మంది సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు వారంతా సైలెంట్ గానే ఉండిపోయారు. ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండిపోవడం.. ఇప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుండడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో వైఎస్ అభిమానులు సహజంగానే షర్మిల వైపు వెళ్తారా అనే చర్చలు మొదలవుతున్నాయి.