రైతు ఇంట్లో అమిత్ షా భోజనం.. కారణం ఇదే?

128

Amit Shah Lunch: వేలాది మంది రైతులు రోడ్ల మీదకు నిరసనలు చేస్తున్న సమయంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్‌కు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సాధారణ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాలోని బలిజూరి గ్రామంలో సనాతన్ సింగ్ అనే రైతు ఇంట్లో నేల మీద కూర్చొని భోజనం చేశారు అమిత్‌ షా. బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా ఈ సమయంలో అమిత్‌ షాతో ఉన్నారు.

అమిత్ షా తన ఇంటికి భోజనానికి రావడానికి ముందు సనాతన్ సింగ్ మాట్లాడుతూ.. తన ఇంటికి అమిత్ షా భోజనానికి వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయని అన్నారు. అయితే విషయం తెలియగానే ముందుగా తాను షాక్‌కు గురయ్యానని, ఆ తర్వాత ఆనందించినట్లు చెప్పారు. తన జీవితంలో ఇలాంటి గొప్ప రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని వెల్లడించారు.

తాను ఒక పేద రైతునని, అందుకే వారికి అన్నంలో పప్పు మాత్రమే పెట్టినట్లు వెల్లడించారు. దేశాన్ని ప్రశాంతంగా, సామరస్యంగా ఉంచాలని అమిత్ షాను కోరినట్లు చెప్పుకొచ్చారు. గత 50ఏళ్లుగా బీజేపీతో ఉన్నట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు అమిత్ షా రైతుల ఇంట్లో భోజనం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.