Allari Naresh: పేలిపోయిన నాంది ట్రైలర్.. ఈసారి హిట్టు పక్కా?

499

Allari Naresh: అల్లరి నరేష్ అల్లరోడిగా కనిపించిన తనలో మాంచి నటుడు ఉన్నాడని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. అల్లరి సినిమాలో చాలా సిల్లీగా కనిపించిన నరేషేనా గమ్యం సినిమాలో గాలి శీను కూడా అనేలా అదరగొట్టేస్తాడు. ఫక్తు మూస కామెడీతో రాణించలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న అల్లరోడే ప్రాణం సినిమాలో అమాయక ప్రేమికుడిగా నటించి మెప్పించాడు. ఈ మధ్యనే మహేష్ బాబు మహర్షి సినిమాలో మంచి పాత్రతో తనలో నటుడిని తట్టి లేపాడు. అయితే.. చాలా కాలంగా నరేష్ కు హిట్ లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.

అందుకు తగ్గట్లే భారీ ఇంటెన్సివ్ ఉన్న పాత్రలో అటు మన చట్టాలని, న్యాయవ్యవస్థను ప్రశ్నించే కోణంలో సాగే సినిమాతో రాబోతున్నాడు. అదే నాంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, టీజర్ ఆసక్తి రేకెత్తించగా తాజాగా విడుదలైన ట్రైలర్ అద్దిరిపోయింది. నాంది ట్రైలర్ ‌లో పేలిపోయి సీన్స్ చాలా ఉన్నాయని చెప్పాలి. నరేష్ కొన్ని సీన్స్‌లో న్యూడ్ కనిపించడంతో పాటు నటనలో అదరగొట్టేశాడని చెప్పేయొచ్చు. అన్నిటికి మించి ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టం ట్రైలర్ లోనే కనిపిస్తుంది.

తాను చేయని హత్య వల్ల శిక్ష అనుభవిస్తోన్న నరేష్ ఎలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దానికి కారణం ఎవరు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందని అర్ధమవుతుండగా.. మన దేశంలో ప్రాణం పోకుండా న్యాయం జరగదా.. అదే నిజమైతే నా ప్రాణం పోయినా నిజం కావాలి అంటూ పోలీస్ థర్డ్ డిగ్రీ ఇచ్చి సెల్ లో వేలాడదీసిన నరేష్ చెప్పిన డైలాగ్ అదుర్స్ అనిపిస్తుంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా కీలక పాత్రలో నటించనుంది. ఫిబ్రవ‌రి 19న ఈ సినిమా విడుద‌ల చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తుండగా ఈసారి అల్లరోడికి హిట్ పక్కా అని యూనిట్ ధీమాగా చెప్తుంది.

Allari Naresh: పేలిపోయిన నాంది ట్రైలర్.. ఈసారి హిట్టు పక్కా?