Agri bills: రాజ్యసభలో వాడీవేడి చర్చ.. బీజేపీ ఎదురుదాడి!

134

Agri bills: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల మంట ఇప్పటికీ చల్లారలేదు. ఇప్పట్లో సమసేలా కూడా లేదు. ఎందుకంటే కేంద్రం ఈ చట్టాలను వెనక్కు తీసుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేదు. అటు రైతులు కూడా చట్టాల అమలుకు అసలు ఇష్టపడడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తుండగా ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు ఎగసిపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం మూడు నెలల పాటు చట్టాలను వాయిదా వేసినా రైతు సంఘాలు మాత్రం చట్టాలను రద్దు చేస్తే తప్ప వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు.

కాగా.. ఇదే విషయంపై ఈ రోజు పార్లమెంటులో చర్చకు వచ్చింది. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా.. విమర్శలను కేంద్రం దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. పాలక, విపక్షాల మధ్య రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. నిరసన చేస్తున్న రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.

రోడ్లపై మేకులు అమర్చడం, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఎదురుదాడికి దిగిన బీజేపీ సాగు చట్టాలపై విపక్షాలు తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించింది. గతంలో తమ మేనిఫెస్టోల్లోనూ ఇదే తరహా చట్టాలను ప్రస్తావించిన పార్టీలు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. నిరసనల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడిన విపక్షాలు.. మంత్రులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తాయి.

రాజ్యసభలో వాడీవేడి చర్చ.. బీజేపీ ఎదురుదాడి!