పంచాయతీ ఏక్రగ్రీవాలపై రచ్చ తప్పదా?

163

ఏపీలో పంచాయతీ ఎన్నికల యుద్ధం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. గత ఏడాది కరోనా వచ్చిన కొత్తలో మొదలైన ఈ పంచాయతీ కరోనాకు టీకా వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కింది కోర్టు నుండి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం వరకు అన్నీ జోక్యం చేసుకున్న ఈ ప్రత్యక్ష యుద్ధంలో మొత్తంగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొత్తంగా ఎన్నికలు జరగాలా వద్దా.. జరుగుతాయా లేదా అనే అనుమానాల నుండి ఇప్పుడు రాష్ట్రంలో ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయి అనే చర్చ మొదలైంది. అయితే.. ఇక్కడే ఈ ఏకగ్రీవాలపైనే ఇప్పుడు మరో రచ్చ తప్పదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. సాధ్యమైనన్ని స్థానాలు.. కుదిరితే వందకు వంద శాతం స్థానాలను ఏకగ్రీవం చేయాలనీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెడితే ఏకగ్రీవాలపై ఎస్ఈసీ రమేష్ కుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే ప్రభుత్వం ఏకగ్రీవాల కోసం భారీ నజరానాలను ప్రకటిస్తూ జీవో జారీ చేయగా.. ఎస్ఈసీ ఏకగ్రీవాలపై నిఘా కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ఇక ప్రభుత్వ సలహాదారు.. జగన్ ప్రభుత్వంలో సీఎం తర్వాత తెరవెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏకగ్రీవాలపై కీలక ప్రకటనలు చేశారు. ఏకగ్రీవాలు చేసుకుంటే వచ్చే నగదుతో పంచాయతీ అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పిన సజ్జల తేడా వస్తే గత ఏడాది తమ ప్రభుత్వం తెచ్చిన గెలిచిన అభ్యర్థులపై అనర్హత వేటు వేసే జీవోను గుర్తు చేశారు. ఈ ప్రకటనతో అలెర్ట్ అయిన ప్రతిపక్షాలు సజ్జల బహిరంగంగానే బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. సో.. ఎన్నికల కమిషనర్ కూడా ఈ విషయంలో ఎలాగు దూకుడుగానే ఉన్నారు కనుక ఇది మరో రచ్చ కానుందా అనిపిస్తుంది.

పంచాయతీ ఏక్రగ్రీవాలపై రచ్చ తప్పదా?