కడప జిల్లాలో తీవ్ర విషాదం: పెన్నానదిలో ఏడుగురు గల్లంతు

63

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఏడుగురు యువకుల ప్రాణాలు తీసింది.ఈతకు వెళ్ళినవారు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన సిద్ధవటంలో గురువారం జరిగింది. తిరుపతి కోరగుంటకు చెందిన యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, సోమశేఖర్‌, రాజేష్‌, తరుణ్‌ సిద్ధవటం వద్ద పెన్నానది వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నది ఒడ్డున సరదాగా ఈత కొడదామని అందులో దిగారు.

అయితే ప్రమాదవశాత్తు వారు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కడప నుంచి గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి నదిలో గాలింపు చర్యలు చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.