అక్కడ పంచాయతీ.! ఇక్కడ పట్టభద్రుల ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లో హడావిడి.!

236

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పండుగ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ హోరు.. తెలంగాణలో ఎమ్మెల్సీ పోరు జరుగుతుంది. ఈ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర ఉత్కంఠ రేపిన పంచాయితీ సమరం సుప్రీం తీర్పుతో ప్రతిష్టంభనకు తెరపడింది. దింతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.. నాలుగు దశలుగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు దశల నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.

వేడి పుట్టిస్తున్న ఎన్నికలు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంతో పాటు బాహాబాహీకి తెరలేపుతున్నాయి ఎన్నికలు.. ఇక ఏపీలో పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అయితే పంచాయితీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధం ఉండదు.. కేవలం బలపరచడం వరకే ఉంటుంది.. ఈ బలపరిచిన అభ్యర్థుల వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బెదిరింపులు, భౌతిక దాడులు ఎక్కువైపోయాయి. అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులేమి కనిపించడం లేదు..

జోరుమీద సాగుతున్న ప్రచారం

తెలంగాణలో రంగారెడ్డి – హైదరాబాద్- మహబూబ్ నగర్ , నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పదవి కాలం మార్ఛి 29 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. నల్గొండ – వరంగల్ – ఖమ్మం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం మొదలు పెట్టారు.. మార్నింగ్ వాక్ చేస్తూ పట్టభద్రులకు దగ్గరవుతున్నారు. మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీలో ఉంటారని భావిస్తున్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రచారం మొదలు పెట్టారు.

కోదండరామ్ కూడా ఇదే స్థానం నుంచి పోటీలో ఉండబోతున్నారు. చెరుకు సుధాకర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక తీన్మార్ మల్లన్న ఇప్పటికే ఈ మూడు జిల్లాలను కవర్ చేస్తూ పాదయాత్ర చేశారు. ఇదిలా ఉంటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గాల గడువు మార్ఛి 14 తో ముగుస్తుంది.. ఈ తేదికి ముందే ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే ఈ నెల ఆఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దింతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఖమ్మం, వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

మొదలైన పంచాయతీ హడావిడి.

ఆంధ్ర ప్రదేశ్ లో పంచయతీ ఎన్నికలను అధికార వైసీపి, ప్రతిపక్ష టీడిపి పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఉత్కంఠ రెట్టింపయ్యింది. ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా నామినేషన్లు వేయించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబట్టుకు కూర్చుంది. ఇక మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఏకగ్రీవాలను ఏకరేజ్ చెయ్యడం లేదు. అసాధారణ ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికే మచ్చ తెస్తాయని అభిప్రాయపడుతోంది ఎస్ఈసీ.. ఇక ఇదిలా ఉంటే వేలంపాటలు కూడా జోరుగా సాగుతున్నాయి. సర్పంచ్ పదవిని లక్షలు పెట్టి కొనుకుంటున్నారు.

అక్కడ పంచాయతీ.! ఇక్కడ పట్టభద్రుల ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లో హడావిడి.!