దీవుల మధ్య 4 కిమీ దూరం.. సమయంలో 21 గంటల తేడా!

1577

ఈ ప్రపంచంలో దేశానికి దేశానికి మధ్యన కాలమానంలో తేడాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే టైం జోన్.. ఆ దేశంలో సూర్యోదయం.. సూర్యాస్తమయం బట్టి.. భౌగోళిక హద్దులను బట్టి ఈ కాలమానాన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు అమెరికా సమయం కంటే మన ఇండియా పదిన్నర గంటల సమయం ముందుంటే మనకంటే బంగ్లాదేశ్ అరగంట సమయం ముందు ఉంటుంది. అదే న్యూజిలాండ్ దేశంతో పోలిస్తే భారతదేశం ఏడున్నర గంటల టైం వెనుక ఉంటే పాకిస్తాన్ మనకంటే అరగంట వెనుక ఉంటుంది. ఇక మన ఇండియాలో అయితే దేశమంతా ఒకే టైం జోన్ అమల్లో ఉంది కానీ కొన్ని ఇతర దేశాలలో ఆయా ప్రాంతాలను బట్టి కూడా టైం జోన్లో మార్పులు ఉంటాయి. మన దేశంలో కూడా ఒక గంట వ్యత్యాసంతో ఈశాన్య రాష్ట్రాలకు ఒక టైం జోన్.. మిగిలిన రాష్ట్రాలకు ఒక టైం జోన్ గా మార్పు చేయాలని కొంతకాలంగా ఒక డిమాండ్ ఉంది.

అయితే.. పక్కనే పక్కనే ఉన్న రెండు దీవులు.. కేవలం నాలుగు కిలోమీటర్లే దూరం ఉన్న రెండు దీవుల మధ్య కాలమానం 21 గంటల సమయం తేడా ఉండడం ఆశ్చర్యం కలిగించకమానదు. సాధారణంగా పక్క పక్కనే ఉండే దీవులు కాబట్టి మహా అయితే నిమిషాలలోనే తేడాలు ఉండాలి కానీ ఏకంగా 21 గంటల తేడా ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇదే నిజం. అమెరికా, రష్యా దేశాలను వేరు చేస్తూ బేరింగ్‌, చుక్చి సముద్రాల మధ్యలో రెండు ద్వీపాలు ఉన్నాయి. వీటిని 1728 ఆగస్టు 16న డెన్మార్క్‌-రష్యాకు చెందిన నావికుడు వైటస్‌ బేరింగ్‌ ఈ ద్వీపాలను కొనుగొని.. వాటికి గ్రీక్‌ దేవుడైన డయోమెడ్‌ పేరుతోనే నామకరణం చేశాడు.‌

ఈ రెండు ద్వీపాలలో విస్తీర్ణంలో పెద్దగా ఉన్న బిగ్‌ డయోమెడ్ రష్యా పరిధిలో ఉండగా.. చిన్నగా ఉన్న లిటిల్‌ డయోమెడ్‌ ద్వీపం అమెరికా పరిధిలో ఉంది. ఈ రెండు ద్వీపాల మధ్య దూరం కేవలం నాలుగు కిలోమీటర్లే కాగా గతంలో ఫిలిప్ క్రోయిజన్ అనే వ్యక్తి కేవలం 5 గంటల్లో యుఎస్ ద్వీపం నుండి రష్యా ద్వీపం వరకు సముద్రంలో ఈది సరికొత్త రికార్డుకు కూడా నెలకొల్పాడు. చూడ్డానికి పక్క పక్కనే ఉన్నా.. కేవలం రెండున్నర మైళ్ళ దూరమే ఉన్నా.. ఈ రెండు ద్వీపాల మధ్య 21 గంటల సమయం తేడా ఉంటుంది. నిజానికి నాలుగు కిలోమీటర్ల దూరానికి ఎటు లెక్కేసినా టైం జోన్లో 21 గంటల తేడా రాదు. కానీ ఈ ద్వీపాల మధ్య అంత తేడా ఎందుకు వచ్చింది అంటే.. ఒకటి టైం జోన్‌ ప్రారంభంలో ఉంటే.. మరోకటి చివర్లో ఉంది.

ఇంకాస్త స్పష్టంగా చెప్పుకోవాలంటే.. ప్రపంచంలో దేశాలను కాలగమనం ప్రకారం వేరు చేసే ఇంటర్నేషనల్‌ డేట్‌ లైన్‌ ఈ రెండు ద్వీపాలలో ఒకదానిని లైన్ మొదట్లో ప్రారంభిస్తే మరో ద్వీపాన్ని లైన్ చివర్లో వేరు చేసింది. దీంతో డేట్ లైన్లో మిగతా దేశాలన్నీ మధ్యలో ఉంటే ఒక ద్వీపం మొదట్లో మరో ద్వీపం చివర్లో ఉంది. దీంతో బిగ్‌ డయోమెడ్‌లో తేదీ మారిన 21 గంటల తర్వాత లిటిల్‌ డయోమెడ్‌లో తేదీ మారుతుంది. అందుకే బిగ్‌ డయోమెడ్‌ను టుమారో ఐలాండ్‌ అని పిలుచుకుంటే.. లిటిల్‌ డయోమెడ్‌ను ఎస్టర్‌డే ఐలాండ్ అని పిలుస్తుంటారు. బిగ్‌ డయోమెడ్ మొత్తం విస్తీర్ణం 29 కిలోమీటర్లు కాగా లిటిల్ డయోమోడ్ విస్తీర్ణం కేవలం 7.2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. బిగ్‌ డయోమెడ్ లో టూరిస్టులు తప్ప స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే వాళ్ళు లేకపోగా లిటిల్ డయోమోడ్ లో మాత్రం సుమారు రెండు వందల మంది నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తుంది.

దీవుల మధ్య 4 కిమీ దూరం.. సమయంలో 21 గంటల తేడా!