సుప్రీం తీర్పు.. సీఎం జగన్ అడుగు ముందుకా.. వెనక్కా?

396

ఏపీలో పంచాయతీ ఎన్నికల రచ్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరుగుతాయా లేదా..? సీఎం జగన్ వెనక్కు తగ్గుతారా..? ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నెగ్గుతారా?.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరవాత అయినా ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా.. లేదా? ఒకవేళ హైకోర్టు తీర్పు మాదిరే సుప్రీం తీర్పును సైతం ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గకపోతే ఎస్ఈసీ రమేష్ కుమార్ తరువాత స్టెప్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో చర్చలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సాగుతూనే ఉంది.

విశ్లేషకులు, న్యాయ నిపుణులు అంచనా వేసినట్లుగానే అత్యున్నత ధర్మాసనం ఎన్నికల కమిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. సుప్రీం తీర్పుతో రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు మొదలయింది. మళ్ళీ అంతలోనే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేశారు. దీని ప్రకారం అంతకు ముందు రెండో దశ తేదీ నుండి కొత్త షెడ్యూల్ ప్రకారం తొలి దశ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఇక.. ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల మీద పడింది.

సుప్రీం తీర్పు తరవాత అయినా రమేష్ కుమార్ కు సహకరించి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఏపీ సర్కార్ అత్యున్నత న్యాయస్థాన ఆదేశాలను సైతం పక్కనపెట్టి ఎన్నికలకు సహకరించకపోతే పరిస్థితి ఏంటి? కోర్టు ధిక్కారణ.. రాష్ట్రంలో రాజ్యాంగ విఫలం అనే అంశాలు ఎన్నికల కమిషనర్ కు ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. దాదాపుగా ఏపీ సర్కార్ వెనక్కు తగ్గి ఎన్నికలకు సహకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్ఈసీ రమేష్ పునఃనియామకం సమయంలో కూడా చివరి వరకు పోరాడిన జగన్ ప్రభుత్వం చివరికి తలొగ్గి మళ్ళీ అయనకు పదవిని అప్పగించాల్సి వచ్చింది. ఇక అయన నిర్వహించ తలపెట్టిన ఎన్నికలలో కూడా అదే రిపీట్ అవుతుందనిపిస్తుంది.