టీఆర్ఎస్ రహస్య ప్లాన్.. స్పష్టతలేక బీజేపీ తికమక!

337

తెలంగాణలో రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తులు అన్నచందంగా సాగుతున్నాయి. అధికారికంగా టీఆర్ఎస్ కు దగ్గరలో లేని బీజేపీ దూకుడు మంత్రంతో ఢీ కొట్టాలని చూస్తుంటే.. అంచనాలకు అందకుండా దూసుకుపోవాలని గులాబీ దళం ప్రణాళికలు గీసుకుంటుంది. ఇప్పటికే దుబ్బాక గెలుపుతో పాటు గ్రేటర్ లో కాస్త పుంజుకున్న బీజేపీ ఇదే ఊపులో నాగార్జున సాగర్ బై పోల్ కూడా సత్తా చాటి రాష్ట్రంలో కారు ప్రత్యామ్నాయం కమలమేనని ఋజువు చేసుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఈసారి ఎలాగైనా బీజేపీ గెలుపు గాలివాటమేనని తేల్చేయాలని టీఆర్ఎస్ పక్కా వ్యూహాలు రచించుకుంటుంది.

నాగార్జున సాగర్ జానారెడ్డికి కంచుకోట అనే పేరున్న సంగతి తెలిసిందే. ఆయన ఎలాగు కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించేయడంతో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం ఎవరా? ఏ లెక్కన అభ్యర్థిని నిలబెడతారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే తమ అభ్యర్థిని దించాలని లెక్కలేసుకుంటుంది. అందుకే ఈసారి గులాబీ దళపతి ప్రత్యర్థికి చిక్కకుండా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నోముల నరసింహయ్య స్థానం కానున్న ఆ కుటుంబం నుండే మరొకరి సీటు కేటాయిస్తారా? బలమైన యాదవ సామజిక వర్గంలో ఒకరిని బరిలో దింపుతారా అనే చర్చ ప్రధానంగా జరుగుతుండగా పార్టీ నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

దీంతో బీజేపీ నేతలకు ఇక్కడ అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ మాదిరే టీఆర్ఎస్ కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటిస్తే బీజేపీ సామజిక, మత ప్రాతిపదికన లెక్కలేసి అభ్యర్థిని దింపే అవకాశం ఉంది. అయితే, టీఆర్ఎస్ మాత్రం ఇప్పట్లో అభ్యర్థి ప్రకటనకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. మరి.. అభ్యర్థి విషయంలోనే ఇంత రహస్య ప్రణాళికలతో వెళ్తున్న ఈ ఎన్నికలలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో.. ఎన్నెన్ని మ్యాజిక్కులు జరుగుతాయో చూడాల్సి ఉంది.

టీఆర్ఎస్ రహస్య ప్లాన్.. స్పష్టతలేక బీజేపీ తికమక!