చిత్తూరులో మరో ఘటన.. దేవుడి దగ్గరకెళ్తున్నానని యువకుడు అదృశ్యం!

199

చిత్తూరు జిల్లాలో అక్కా చెల్లెళ్ళ హత్యా ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. పురుషోత్తమ నాయుడు, పద్మజ అనే ఇద్దరు చదువుకున్న మూర్ఖులు భక్తి, మూఢనమ్మకాల పిచ్చిలో పడి కన్న బిడ్డలను పొట్టనబెట్టుకున్నారు. మళ్ళీ బ్రతికివస్తారనే భ్రమలో డంబెల్ తో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. వీరు భక్తి, మూఢత్వంతో మానసిక రోగులుగా మారిపోయారని ఆ జంట హత్యల దర్యాప్తులో తేలగా ఇప్పటికీ ఈ కేసులో కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఇదిలా ఉండగానే అదే జిల్లాలో ఇప్పుడు మరో ఘటన ఒకటి కలకలం రేపుతోంది.

చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన గణేష్ అనే యువకుడు తాను దేవుడి వద్దకు వెళ్తున్నానని రెండు పేజీల లేఖ రాసిపెట్టి అదృశ్యమయ్యాడు. జనవరి 21 నుంచి ఇంటి నుండి వెళ్లిన యువకుడు మళ్ళీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించడం లేదు. గణేష్ ఇంటి నుండి వెళ్లేప్పుడు వెంట పుస్తకాల బ్యాగు ఒకటి, బైకు, సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. అయితే.. ఫోన్ మాత్రం అప్పటి నుండే స్విచ్ ఆఫ్ వస్తుంది. సహజంగా గణేష్ కు దైవభక్తి ఎక్కువగా కాగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటాడట. మదనపల్లె హత్యల నేపథ్యంలో కుటుంబ సభ్యులు యువకుడి అదృశ్యంపై ఆందోళన చెందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.