ఏపీ రాజధాని తరలింపు.. ఇక ఇప్పట్లో అయ్యేపని కాదేమో?!

398

ఏపీ రాజధాని తరలింపు ఎప్పుడు?.. రాష్ట్రానికి రాజధాని ఒకటా.. మూడా?.. మూడు ఒకేసారి తరలిస్తారా.. ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తారా? వీటికి ఏపీ ప్రభుత్వం నుండి వచ్చే సమాధానం మాత్రం ఒక్కటే.. మేము మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. త్వరలోనే ప్రక్రియ మొదలు పెడతాం. రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ చేత కూడా గణతంత్ర దినోత్సవం రోజున ఇదే మాట పలికించారు. అయితే.. అసలు మూడు రాజధానుల ప్రక్రియ ఇప్పుడు అయ్యే పనేనా? అంటే మాత్రం న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు అనుమానమేనని చెప్తున్నారు.

ప్రస్తుతం మూడు రాజధానుల ప్రక్రియ న్యాయస్థానాల పరిధిలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల రద్దు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం పొందినా హైకోర్టులో పెండింగ్ లోనే ఉంది. నిజానికి ఈ బిల్లులపై విచారణ జరగాల్సి ఉన్నా న్యాయమూర్తుల బదిలీతో పెండింగ్ లో పడింది. కొత్త న్యాయమూర్తులు వచ్చినా పెండింగ్ లో ఉన్న ఎన్నో వాటితో పాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద వచ్చే వాటిని విచారించే సరికి పుణ్యకాలం కాస్త సరిపోతుంది. పైగా ఇప్పుడు కొత్తగా వచ్చిన సీజే అరూప్ గోస్వామి అసలు రాజధాని సమస్యకు మూలాల గురించి అన్వేషిస్తున్నట్లుగా చెప్తున్నారు.

ఫిబ్రవరి నెలలో ఈ పిటిషన్ల మీద విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి తుది తీర్పు ఎప్పుడన్నది చెప్పలేని పరిస్థితి. ఆ తీర్పు వచ్చేవరకు ప్రభుత్వం అధికారికంగా రాజధాని తరలింపు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ కోర్టుల నుండి క్లియరెన్స్ వచ్చినా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తేనే అధికారికంగా తరలింపు జరిగినట్లు.. కేంద్రం ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకొనే పరిస్థితిలో ఉందా అన్నది అనుమానం. ఇక హైకోర్టు తరలింపుకు అయితే.. సుప్రీం కోర్టు నుండి కేంద్ర ప్రభుత్వం వరకు చాలా ఫార్మాలిటీ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ సమ్మర్ లో రాజధాని తరలింపు అని మరో ముహూర్తం పెడుతుంది. మరి ఇది సాధ్యమేనా?

అసలే ఫిబ్రవరి నెల మొత్తం ఇప్పటికే ఎన్నికలకు టైం టేబుల్ ఫిక్స్ అయింది. పంచాయతీల తర్వాత మున్సిపాలిటీలకు ఎస్ఈసీ ముహూర్తం పెట్టాలని చూస్తున్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ తతంగమంతా మరో మూడు నెలలు పడితే ప్రభుత్వం పెట్టిన సమ్మర్ ముహూర్తం ఎన్నికలలో కొట్టుకుపోతుంది. తర్వాత కోర్టులు, కేంద్రం ఆసక్తి మీదనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. ఫలితంగా రాజధాని తరలింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బట్ గవర్నమెంట్ డెసిషన్ మాత్రం త్రీ క్యాపిటల్స్. ఇదే ఫైనల్.

ఏపీ రాజధాని తరలింపు.. ఇక ఇప్పట్లో అయ్యేపని కాదేమో?!