ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

320

ఆర్ఆర్ఆర్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి అలాంటిది సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తే ఊరికే ఉంటారా.. జయహో జక్కన్న అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. నిజానికి ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి షూటింగ్ మీద దెబ్బ కొట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు వచ్చే దసరాకు అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు జక్కన్న ప్రకటించాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా అటు మెగా.. ఇటు నందమూరి అభిమానులు తమ అభిమాన హీరో కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇటు చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేసిన రాజమౌళి తాజాగా రిలీజ్ డేట్ తో పాటు ఓ ఫోటోను కూడా అభిమానులకు కానుకగా వదిలారు. ఇందులో చరణ్ గుర్రంపై స్వారీ చేస్తుంటే.. ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ మీద సవారీ చేస్తున్నారు. అయితే.. రైడ్ వేరైనా ఇద్దరూ ఒకే ఎమోషన్ లో ఉండేలా జక్కన్న ఈ ఫోటో విడుదల చేయగా ఫోటో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో షేర్లు, లైకులతో తెగ వైరల్ చేస్తున్నారు.