6 నెలలుగా సరస్సు అడుగున ఉన్నా పనిచేసిన యాపిల్ ఫోన్!

15292

నేటి కాలంలో ఫోన్ లేని మనిషి ఉన్నాడంటే నమ్మడం చాలా కష్టమే. అందరి చేతుల్లో ఫోన్ కనిపించడం కామన్ గా మారిపోయింది. మొబైల్ ఫోన్స్ వాడకం ఎంత విరివిగా మారిపోయిందో అవి కింద పడడం.. నీటిలో పడడం కూడా అంతే కామన్ అయిపొయింది. అయితే సాధారణంగా ఫోన్ ప్రమాదవశాత్తు నీటిలో పడితే పనిచేయడం కష్టమే. వాటర్ రెసిస్టెంట్ పవర్ ఉన్న కొన్ని మోడల్స్ తప్ప దాదాపుగా నీటిలో పడితే ఫోన్ మెకానిక్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఇక ప్రీమియం బ్రాండ్లలో ఆపిల్ ఐఫోన్‌లలో అయితే ఐపి68 వాటర్ రెసిస్టెంట్ ఉండటం వల్ల రెండు మీటర్ల లోతులో 30 నిమిషాల వరకు పనిచేస్తుందని ఆ కంపెనీ చెప్తుంది. కానీ ఒక ఐఫోన్ మాత్రం ఏకంగా సరస్సు అడుగున ఆరునెలల పాటు పడిఉన్నా పనిచేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలో ఈ ఘటన జరిగింది.

వాంకోవర్‌కు చెందిన ఫాతిమా ఘోడ్సీ అనే మహిళ గత ఏడాది సెప్టెంబర్‌లో బ్రిటీష్‌ కొలంబియాలోని హారిసన్ సరస్సులో బోటుపై ప్రయాణించింది. ఇదే సమయంలో ఐఫోన్‌11 పొరపాటున ఆమె చేతిలోంచి జారి నీటిలో పడిపోయి సరస్సు అడుగుకి వెళ్ళిపోయింది. సముద్రంలో కానీ ఇలాంటి సరస్సులో కానీ ఫోన్ జారిపోతే మళ్ళీ దొరకడం అయ్యేపని కాదు. ఘోడ్సీ ప్రయాణించిన హారిసన్ సరస్సులో అడుగు భాగానికి చేరుకునే కొద్దీ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. ఎవరైనా ఆ సరస్సు అడుగు భాగానికి చేరుకోవాలని ప్రయత్నించినా అతి తక్కువ ఉష్ణోగ్రతల వలన నిమిషాల్లోనే రక్త నాళాలు చిట్లిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ మహిళ కూడా తన ఫోన్ గురించి శలు వదిలేసుకొని మర్చిపోయారు.

కానీ అకస్మాతుగా ఓ ఆరునెలల తర్వాత తాను పోగొట్టుకున్న ఫోన్ నుండి ఘోడ్సీకి ఒక మెసేజ్ వచ్చింది. ఎక్కడైతే ఫోన్ పడిపోయిందో మళ్ళీ ఆ సరస్సు వద్దకే వచ్చి ఆ ఫోన్ తీసుకెళ్లాలని ఆ మెసేజ్ సారాంశం. కాసేపు షాక్ కు గురైన ఆ మహిళ తేరుకొని తన ఫ్రెండ్స్ ఎవరో కావాలని ఆటపట్టిస్తున్నారని లైట్ తీసుకున్నారు. కానీ మళ్ళీ అదే ఫోన్ నుండి మరో మెసేజ్ రావడంతో ధైర్యం చేసి ఆ మహిళ హారిసన్ సరస్సు వద్దకు చేరుకోవడంతో ఇద్దరు వ్యక్తులు ఘోడ్సీకి తన ఫోన్ తిరిగి ఇచ్చేశారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే సరస్సులో పడిపోయిన ఫోన్ మళ్ళీ దొరకడం ఏంటి.. అది కూడా ఇప్పటికీ పాడవకుండా పనిచేయడం ఏంటి.. అది బయటకు తీసినవారు మళ్ళీ తనకు తిరిగి ఇచ్చేయడం ఏంటి అని ఆమె ఆశ్చర్యానికి మాత్రం ఫుల్ స్టాప్ పడనేలేదు.

ఇంతకీ అసలు ఆ ఫోన్ మళ్ళీ ఎలా దొరికిందంటే.. క్లేటన్ హెల్కెన్‌బర్గ్, అతని భార్య హీథర్ హారిసన్ అనే ఇద్దరు ఫ్రీడైవర్స్ ప్రతిరోజు సరస్సు అడుగు భాగానికి చేరుకొని అక్కడ ఉన్న చెత్త, చెదారం.. డ్రింక్ బాటిల్స్, ప్రయాణికులు పడేసుకున్న వస్తువులను వెలికి తీస్తుంటారు. అన్ని జాగ్రత్తలను తీసుకొని సరస్సు అడుగున హంటింగ్ మొత్తాన్ని తమ కెమెరాలలో షూట్ చేసి ఈ దంపతులు తమ సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంటారు. ఇది వీరికి నిరంతర ప్రక్రియ. ఒకరోజు యధావిధిగా ఆ జంట సరస్సు అడుగుభాగంలో వెతుకుతుండగా ప్రయాణికుల స్పెట్స్, గాగుల్స్ వంటి వస్తువులతో పాటు రెండు ఫోన్స్ కూడా కనుగొన్నారు. వాటిలో ఒకటి ఫ్లిప్ ఫోన్ కాగా మరొకటి ఐఫోన్ 11. ఫ్లిప్ ఫోన్ అప్పటికే పాడైపోగా ఐఫోన్ మాత్రం ఎంచక్కా పనిచేయడం విశేషం. ఆ ఫోన్ లో ఉన్న సమాచారం ఆధారంగానే యజమాని ఘోడ్సీకి మెసేజ్ పంపించడంతో ఆమె సరస్సు వద్దకు వచ్చి ఆనందంగా ఫోన్ తీసుకెళ్లారు.

అయితే.. సాధారణంగా ఐఫోను నీటిలో 30 నిమిషాల పాటు సర్వేవ్ చేయగలదని ఆ కంపెనీ చెబుతోంది. కానీ ఫాతిమా ఘోడ్సీ ఫోన్ మాత్రం ఆరు నెలలు నీటిలో ఉన్నా పనిచేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐఫోన్ లో ఇంగ్రెస్ ప్రొటెక్షన్ ఉండగా ఐఫోన్ 11కి ఈ ఐపీ 68 రేటింగ్ ఉందట. అయితే.. సరస్సులో పడ్డ ఫోన్ ఆరు నెలలు నీటిలో ఉన్నా ఈ టెక్నాలజీ వలనే పాడైపోలేదని చెప్తున్న టెక్నాలజీ నిపుణులు ఆరు నెలలు గడిచినా పనిచేయడం మాత్రం గ్రేట్ అనే చెప్తున్నారు.

6 నెలలుగా సరస్సు అడుగున ఉన్నా పనిచేసిన యాపిల్ ఫోన్!